ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 30 కోట్ల మంది సమాచారానికి ప్రమాదం

ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 30 కోట్ల మంది సమాచారానికి ప్రమాదం


భారత్‌లోని అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌ల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో ఓ లోపం వెలుగుచూసింది.


దీని వల్ల ఆ సంస్థకున్న 30 కోట్లకుపైగా వినియోగదారుల సున్నితమైన వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కే ప్రమాదం ఏర్పడింది.


హ్యాకర్లు ఎవరైనా, ఆ లోపాన్ని ఉపయోగించుకుని.. ఎయిర్ టెల్ వినియోగదారుల పేరు, లింగం, ఇ-మెయిల్ అడ్రెస్, పుట్టిన తేదీ, చిరునామా, సబ్‌స్క్రిప్షన్ సమాచారం, ఫోన్ ఐఎమ్‌ఈఐ నెంబర్ వంటి కీలకమైన సమాచారాన్ని దొంగలించవచ్చు. ఇందుకు వారికి కేవలం ఆ వినియోగదారుడి మొబైల్ నెంబర్ తెలిస్తే చాలు.


ఎహ్రాజ్ అహ్మద్ అనే సైబర్ భద్రత పరిశోధకుడు ఈ లోపాన్ని మొదటగా గుర్తించారు.


15 నిమిషాల్లోనే ఈ లోపాన్ని తాను గుర్తించినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.


ఆ లోపం ఉన్నట్లు నిరూపించేందుకు అహ్మద్ బీబీసీ ముందే వినియోగదారుల సమాచారాన్ని వెలికితీసి చూపించారు. కేవలం ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఆ నెంబర్ వినియోగిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారులకు సంబంధించి కీలక సమాచారం ఒక్క క్లిక్‌లో బయటపెట్టి చూపించారు.


ఈ సమాచారం సాధారణంగా బయటకు చూపించరు. ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలోని లోటుపాట్లను పరిశీలేందుకు ప్రయత్నించి, అహ్మద్ ఈ లోపాన్ని కనిపెట్టారు.