బిగ్‌బాస్‌: దీపావళి వేడుకల్లో శివజ్యోతి

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో చివరగా ఎలిమినేట్‌ అయిన వ్యక్తి శివజ్యోతి. హౌస్‌ను వీడేముందు శివజ్యోతి ఓ చిన్న ట్విస్ట్‌ ఇచ్చింది. అలీని పక్కన పెట్టేసి శ్రీముఖి బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవాలని కోరుకుంటున్నట్టుగా తెలిపింది. అటు అలీ కూడా శివజ్యోతిని కాదని రాహుల్‌ టైటిల్‌ సాధించాలని కోరుకున్నాడు. ఇక ట్రంకుపెట్టెతో బయటకు వచ్చేసిన శివజ్యోతి కన్నీళ్లతోనే బిగ్‌బాస్‌ నుంచి వీడ్కోలు తీసుకుంది. మొదటి నుంచి ఇంటి సభ్యులందరికీ టఫ్‌ ఫైట్‌ ఇస్తూ వచ్చిన శివజ్యోతి చివరివరకు టైటిల్‌ కోసం పోరాడింది. కాగా పద్నాలుగోవారంలో ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేసిన శివజ్యోతి తన స్నేహితులను కలుసుకుంది.



తన కన్నా ముందే ఎలిమినేట్‌ అయిన రవికృష్ణ, అషూ రెడ్డి, రోహిణి, హిమజలను శివజ్యోతి కలుసుకుంది. వారితో కలిసి సరదాగా దీపావళి వేడుకలను జరుపుకుంది. ఈ మేరకు వాళ్లంతా కలిసి టపాకాయలు పేల్చుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఈ వీడియోలో శివజ్యోతి.. స్నేహితులతో కలిసి పీకల్లోతు సంబరాల్లో మునిగిపోయింది. కాగా తనకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది.